BREAKING NEWS
Search

About Us

పాఠక దేవుళ్లకు నమస్సుమాంజలి!

పత్రికల ప్రగతి, పాత్రికేయుల సమగ్రాభివృద్ధి అనే ఆశయాలు ఆకర్షణీయమైన నినాదాలు గానే మిగిలిపోయాయి. ప్రాచీనమైన ప్రచురణ రంగాన్ని, దానిపై ఆధారపడిన పాత్రికేయ సమాజాన్నీ, వృత్తిపరమైన సంస్కృతినీ పరిరక్షిస్తూనే పత్రికా రంగాన్ని పురోగమన పథంలో పయనింప చేస్తామన్న నేతల మాటలు నీటి మీద రాతలనిపించుకుంటున్నాయి. స్వాతంత్యానంతరం ఈ ఏడు దశాబ్దాల కాలంలో శుష్కప్రియాలు, శూన్యహస్తాలు మాత్రం అమాయకులైన పాత్రికేయ సంతతికి మిగిలిపోయాయి. అభివృద్ధి ఆశించిన రీతిలో లేక, అటు పారంపర్యంగా వస్తున్న వెనుకబాటుతనం, భాషాపరమైన జాడలు తరాల తరబడి వీడక తెలుగు పత్రికా రంగం రెండు విధాలా నష్టపోయింది. ఇక ప్రచురణ రంగం సంస్కృతీ, సంరక్షణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.

నేటి పోటీ ప్రపంచంలో చిన్న, మధ్యతరహా పత్రికలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంతో పోల్చితే, చిన్న, మధ్యతరహా పత్రికల మనుగడ కష్టసాధ్యంగా మారింది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక, ప్రయివేటు సంస్థలు ఆదరించక, నమ్ముకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు సహకరించక ‘చిన్న’ పత్రికలు పడుతున్న కష్ట, నష్టాలు పదాల్లో చెప్పలేనివి. కల్పితమైనా తమ గురించి పొగడ్తలతో రాస్తే తిలకించి, పులకించే వారు, ఉన్నది ఉన్నట్లు అక్షర రూపం ఇస్తే గిట్టక, కక్షపూరితంగా వ్యవహరించే వారూ మనగలుగుతున్న ఈ వ్యవస్థలో పాత్రికేయుల శ్రమ వర్ణనాతీతం. తమ గురించి గొప్పలు రాసే వారిని చూసుకుని గర్వపడి, ఇదే అన్ని పత్రికల సంస్కృతీ, సంరక్షణ అని ప్రగల్భాలు పలికే నాయకమ్మన్యుల పరివారం క్రమంగా పెరిగిపోతోంది. ఈ సంస్కృతి చివరికి పాత్రికేయ సంఘాల్లోని ప్రతినిధుల్లో సైతం అభివృద్ధి చెందడం పొల్లు మాటకు తావీయని ఘనమైన మన రంగం చేసుకున్న దురదృష్టం.

తెలుగు పత్రికా రంగం అభివృద్ధి అసలే లేదని కాదు. అయితే అది అసంగతాభివృద్ధిగానే ఉందన్నది అందరూ అమోదించాల్సిన చేదు నిజం. ఏవో నామమాత్రపు రాయితీలు, గుర్తింపు కార్డులూ, ఆసుపత్రుల్లో కనీసం ఆరోగ్యశ్రీ కార్డు కంటే కూడా ఎలాంటి ప్రాధాన్యత లేని హెల్త్ కార్డులో, ప్రమాద బీమా వంటివి కల్పించినంత మాత్రాన అభివృద్ధి అట్టడుగు స్థాయికి అందుబాటులోకి రాదన్నది ఈ ఏడు దశాబ్దాల చరిత్ర చెప్పే వాస్తవం. చిత్తశుద్ధి లేని కార్యాచరణ పర్యవసానం మన రంగంలో అడుగడుగునా ద్యోతకమవుతుంది. అభివృద్ధి చెందిన ఆర్ధిక సమస్యలు కాలనాగుల్లా పత్రికా రంగంపై విలయం సృష్టిస్తున్నాయంటే ఇన్నేళ్ల ప్రగతి గతి ఏమిటో అన్న చింత జనిస్తుంది. పత్రికకో కేటగిరి, యాజమాన్యానికో విధానం అంటూ రొమ్ము చరుచుకొనే నేతలు ప్రకటిస్తూ ఉంటే, ఈ రంగాన్నే నమ్ముకుని, దీనిపైనే ఆధారపడ్డ చాలా మందిని కమ్ముకున్న నిరక్షరాస్యతా తిమిరం కల్లెదుట సాక్షాస్కరిస్తుంది. అపార సంపదలను సక్రమంగా వినియోగించుకోవాల్సిన రంగంలో దుర్భర దారిద్ర్యం, దయనీయమైన జీవన విధానం విశ్వరూపంతో ప్రత్యక్షమై తలవంపులు తీసుకువస్తాయి.

ఆశయాలు గిరిశిఖరాల్లా మహోన్నతంగా ఉంటే వాటి అమలు అధ:పాతాళంలో ఉన్న ఎన్నో దృశ్యాలు గోచరిస్తాయి. ఆ స్థితిగతుల్ని, ప్రజల వెలుగు, నీడల్ని, జన జీవనంలో విభిన్న పార్శ్యాల్నీ ప్రత్యేకంగా, ప్రముఖంగా పదిమంది దృష్టికీ తీసుకురావాలన్న సంకల్పంలో నుంచి ఉద్భవించింది ‘ప్రజాజ్యోతి’. అదే సమయంలో మన సంతతికి చెందిన ఎందరినో సంఘటితపరిచి, వారికి ఘనమైన సంస్కృతీ పరంపరను తెలియజెప్పి, ఆసేతు శీతాచల పర్యంతం విస్తరించి ఉన్న ప్రాచీన విధానంలో వైవిద్యాన్ని, విస్తృతిని వివరించాలన్న సత్సంకల్పం కూడా ‘ప్రజాజ్యోతి’ ఉదయించడానికి కారణభూతమయింది.

పాత్రికేయ సంతతికి చెందిన వారు ఈ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు లేక వేరువేరు జీవన రంగాలలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలో ఎందరో నిర్ణయాత్మక స్థాయికి చేరుకుంటున్నారు. వారందరికీ తమ సంస్కృతీ విశిష్టతను చాటి చెబుతూ, వారిలో ఆత్మగౌరవ ఉద్ధీపనకు దోహదపడాలన్నది ఈ చిరు ప్రయత్నం ధ్యేయం. ఈ అసంఖ్యాక జనావళికి సంబంధించిన సమాచారాన్నే కాకుండా సామాన్యులకు ఉపయోగపడే అంశాలను సమగ్రంగా అందించాలన్నది మా కరదీపిక (పత్రిక) లక్ష్యం. ఇంతవరకు వివిధ రీతుల్లో ఇటువంటి సమాచారం కొంతవరకూ వస్తూ ఉండవచ్చు. అయితే పూర్తిగా పత్రికా రంగంలో మమేకమై, ఆ జీవన విధానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వారి చేతుల మీదుగా వెలువడుతూ ఉండడమే మన ‘ప్రజాజ్యోతి’ విలక్షణ లక్షణం.

తొమ్మిదేళ్ల ప్రస్థానంలో…
‘ప్రజాజ్యోతి’ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అనూహ్య ఫలితాలను చూడడం తొలి విజయమైతే, మెరుగైన పాఠకులను సొంతంచేసుకోవడం మేము సాధించిన మలి విజయంగా చెప్పవచ్చు. అడవుల జిల్లా ఆదిలాబాద్ కేంద్రంగా సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట ప్రారంభమైన ‘ప్రజాజ్యోతి’ తొలుత నిర్ణయించుకున్న లక్ష్యాన్ని కంటే ముందుగానే మరో మూడు ప్రచురణ కేంద్రాల (నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి)ను తన ఖాతాలో చేర్చుకుంది.

‘ప్రజాజ్యోతి’ దినపత్రిక తొలికాపీ మార్కెట్లోకి వచ్చిన నాటి నుంచే మా పరుగు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. లాభాల కోసం కాకుండా వీలైనంత ఎక్కువ మంది పాఠకులకు చేరువకావాలన్న ఏకైక లక్ష్యంతో వార్తల ప్రచురణ, సర్క్యులేషన్ విషయాలలో పల్లె ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడం జరుగుతోంది. పత్రిక విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన నేపథ్యంలో ‘ప్రజాజ్యోతి’ దినపత్రికకు అనుబంధంగా వార పత్రికనూ ప్రారంభించడం జరిగింది.

అలుపెరుగని అక్షర పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులను, ఆటంకాలనూ అధిగమించి తోటి పత్రికలకంటే విభిన్నంగా, వినూత్నంగా దూసుకుపోతున్న ‘ప్రజాజ్యోతి’ 2016 ఉగాది (ఏప్రిల్ 8) నుంచి రంగుల్లో (కలర్‌లో) ముద్రించడం జరుగుతోంది. పెద్ద దినపత్రికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ‘ప్రజాజ్యోతి’ని నిలిపినందుకు పాఠక దేవుళ్లకు నమస్సుమాంజలి తెలపడం కంటే చేసేదేమీ లేదు.

అంతర్జాలంలోనూ…
‘ప్రజాజ్యోతి’ని కేవలం పరిమిత పాఠకులకే అందుబాటులో ఉండే ప్రింట్ ఎడిషన్ గానే కాకుండా అంతర్జాలంలో (ఇంటర్నెట్లో) కూడా అందుబాటులో ఉంచాలన్న ఆలోచనే ఈ వెబ్‌సైట్. ‘న్యూస్‌టైమ్’ సాంకేతిక సహకారంతో ఏర్పాటుచేసిన www.prajajyothi.com రోజువారీ వార్తలను, ఛాయాచిత్రాలను నెట్ పాఠకులకు అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. దీనికి తోడు రోజూ ప్రచురితమవుతున్న నాలుగు ఎడిషన్ల దినపత్రిక డిజిటల్ కాపీలనూ, వారం రోజులకు ఒకసారి ప్రచురితమయ్యే వారపత్రికను పి.డి.ఎఫ్. ఫార్మెట్లో అందిస్తుండడం అదనపు ఆకర్షణ.

ఉజ్వల కాంతిని వ్యాపింప చేయాలన్న సంకల్పంతో వెలిగించిన ఈ చిరుదీపాన్ని తిలకించి మా ప్రయత్నానికి మీ సహాయ సకారాలు అందిస్తారన్నది ఆకాంక్ష. మీ అమూల్య సలహాలు, సూచనలు, ప్రతిస్పందనలే ‘ప్రజాజ్యోతి’కుటుంబానికి శ్రీరామరక్ష.

మీ,
వి. శ్రీనివాస్‌రెడ్డి.
ఎడిటర్ & పబ్లిషర్
మొబైల్: 09440231967,
ఇ-మెయిల్: prajajyothiadilabad@gmail.com
వెబ్‌సైట్: www.prajajyothi.in