BREAKING NEWS
Search

దిశ అత్యాచారం, హత్య: ‘పోలీసుల ఎన్‌కౌంటర్లో నలుగురు నిందితులు మృతి…సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్

67

 

 

దిశ అత్యాచారం, హత్య: ‘పోలీసుల ఎన్‌కౌంటర్లో నలుగురు నిందితులు మృతి’ – సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్

దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. తెలంగాణ శాంతిభద్రతల అడిషనల్ డిజీ జితేందర్ బీబీసీకి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీనిపై నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన అన్నారు.
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, ” సీన్ రీ కన్ స్ట్రక్ట్ చేస్తుండగా నిందితులు తిరగబడ్డారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా నలుగురూ చనిపోయారు. ఇప్పటివరకు ఇదీ మాకు తెలిసిన సమాచారం. మిగతా వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాతే ధ్రువీకరించగలను. ఈ ఘటనలో మా పోలీసులు ఇద్దరికి గాయాలయ్యాయి. నేను ఇప్పుడు స్పాట్‌కు వెళ్తున్నాను”‘ అని చెప్పారు.
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించడానికి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మొత్తం నలుగురు నిందితులూ చనిపోయారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.
బాధితురాలి మృతదేహాన్ని గుర్తించిన చోటనే..
నవంబర్ 28 ఉదయం ఇదే చోట దిశ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఓ లారీ డ్రైవర్, ముగ్గురు క్లీనర్లను నిందితులుగా భావిస్తూ అరెస్టు చేశారు.
దిశ స్కూటీకి పంక్చర్ వేసి, దానిని బాగు చేయిస్తామని చెప్పి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చనిపోయిన తర్వాత పెట్రోలు, డీజిల్ పోసి కాల్చామని ఆ నలుగురు నిందితులు తెలిపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నవంబర్ 27 సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దిశపై శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు.
నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరిగింది.
దిశ హత్య జరిగిన ప్రదేశం
దిశ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది. అనేక మంది స్పందించారు. సంతాపం తెలిపారు. రోడ్ల మీదికొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.
కేసు విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. రాష్ట్ర హైకోర్టు సైతం ఇందుకు ఆదేశాలు జారీ చేసింది.
నలుగురు నిందితులను వారం రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఏ క్రమంలో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా 4గురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నామ్ చేసారు. పోలీసులపై రాళ్లు విసిరారు. తప్పించుకునేందుకు ప్రయత్నం చేసిన నిందితుల్ని పోలీసులు తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చేసారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *