BREAKING NEWS
Search

తమను తాము క్షమించుకోవడం అంటే?

62

చాలా మంది తమను తమను తాము క్షమించుకోమంటూ సలహాలు ఇస్తుంటారు. అసలు దీని అర్థమేంటి. అలా ఎందుకు క్షమించుకోవాలి? ఈ లోకంలో తప్పు చేయనివారంటూ ఎవరూ లేరు. అలావుండే మనుషులు మహనీయులవుతారే కానీ మానవులు కారు. చేసిన తప్పును, దాని తాలూకూ పరిణామాలను పదేపదే తలపోయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదు కాగా, మనలో ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అలాగే, తప్పు మరోమారు జరగకుండా చూడొచ్చు గానీ, దాని తాలూకూ జ్ఞాపకాలను చెక్కు చెదరనీయకుండా బుర్రలో పదిలపరచుకోవడం సమంజసం కాదు. ప్రతి క్షణం అది అలా జరగకుండా ఉంటే బాగుండేదని తలపోయడం తగదు.

దీనివల్ల కలిగే ప్రతికూల భావనలు ఇబ్బంది పెడతాయి. అందువల్ల ఎపుడు కూడా జరిగిన తప్పులను క్షమించుకుంటూ మరోమారు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మంచి ఆలోచనల వైపు దృష్టిసారించాలని ఆధ్యాత్మిక నిపుణులు సలహా ఇస్తున్నారు. కాగా, సమం పశ్యన్‌ హి సర్వత్ర సమవస్థిత మీశ్వరం! నబినస్త్యాత్మ నాత్మానం తతోయాతి పరాంగతిమ్‌-2 (ఆత్మను సర్వత్ర సమంగా చూసే యోగి ఆత్మను ఆత్మచేత హింసించుకో జాలడు. అతడు పరమగతినే పొందగలడు)- భగవద్గీత. పై శ్లోకం ప్రకారం.. నీవు ఎవరిని హింసించినా, నిన్ను నీవే హింసించుకున్నవాడివవుతావని స్వామి వివేకానంద తన ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. హింసించే కార్యాలన్నీ నీకు తెలిసినా, తెలియకున్నా, అన్ని చేతులతోనే జరిగిపోతుంటాయి. పండితులలోనూ, పామరులలో కూడా మానవుడుంటాడు.

నీవు చేసే ప్రతి కార్యము నిన్నే ఉద్దేశించిందవుతుందని, అందుచేత హింసకు పూనుకోక సానుభూతి పరుడివి కావాలని స్వామి ఉద్భోధించారు. మనం ఇతరులకు అపకారం చేస్తే.. అది తనకు తాను చేసుకున్నట్లవుతుందని, అదేవిధంగా ఇతరులను హింసించినా, తనను తాను హింసించుకున్నట్లవుతుందని స్వామి వివేకానంద వెల్లడించారు. కాగా, ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు స్పష్టంగా బోధించాడు. ముఖ్యంగా భగవద్గీత”లో శ్రీకృష్ణపరమాత్ముడు అర్జునునికి బోధించినట్టుగా ఉంటాయి. కానీ, అది సమస్త మానవాళికి బోధించిన సందేశం. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నా యందు విశ్వాసంతో పని చేయండి అని చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతి చర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని గ్రహించండి. అయితే, ముక్తి మార్గం కోసం మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయాలి.

ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సుని మరల్చాలి. మనస్సు, ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం కష్టమే. ఆ కష్టాన్ని అధికమించేందుకే యోగ, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనస్సు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనస్సును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *